17 May, 2026 | 3:34 AM

అర్హులకు చోటు కల్పించడమే సర్ ఉద్దేశం

17-05-2026 12:00 AM
  1.   18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి 
  2. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి) : ఓటరు జాబితాలో అనర్హుల పేర్లు తొలగించడం, అర్హులకు చోటు కల్పించడమే సర్ (స్పెషల్ ఇం టెన్సివ్ రివిజన్) ఉద్దేశమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో జూన్  15 నుంచి సర్ ప్రక్రియ మొద లవుతుందన్నారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో జరిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.

జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారని ఆయన వివరించారు. ప్రతి ఓటరుకు రెండేసి ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇస్తారని.. అందులో ఒకటి పూ ర్తి చేసి మళ్లీ బీఎల్‌ఓలకు ఇవ్వాలని, ఇంకో ఫామ్‌ను ఓటరు తన దగ్గరే ఎకనాలెడ్జ్‌మెంట్‌గా ఉంచుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లోనూ వెబ్ సైట్ ద్వారా ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. 

జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్, అదే రోజు నుంచి అభ్యంతరాల స్వీకరణ

ఓటర్లు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫామ్‌లను సేకరించి జూలై 31న  డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తామని, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని సీఎస్ పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిశీలించాక ఆక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. పత్రాల సమర్పణకు నిబంధనలు వర్తిస్తాయన్నారు.

1987 జూలై 1కు ముందు జన్మించిన వారికి ఒకే పత్రం సరిపోతుందని, 1987 2004 మధ్య పుట్టిన వారికి తల్లిదండ్రుల వివరాలు చెబితే సరిపోతుందని, 2004 తర్వాత జన్మించిన వారికి మాత్రం తల్లిదండ్రు ల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.     18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హెల్ప్‌లైన్ 1950 తో పాటు ‘ బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌ఓ’ సదుపాయం కల్పించినట్లు సీఎస్ చెప్పారు.