రోడ్డు ప్రమాదంలో 30 గొర్రెల మృతి
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సరిత తిరుపతయ్య హామీ
ఎర్రవల్లి: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జాతీయ రహదారి హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అంజనమ్మకు చెందిన సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రోడ్డును అవతలి వైపుకు దాటుతున్న క్రమంలో తుఫాన్ పహనం వేగంగా వచ్చి గొర్రెలను ఢీ కొట్టింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి చైర్‌పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య స్పందించారు.
ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు, వెటర్నరీ వైద్యాధికారులకు సూచించారు. ప్రమాదం వల్ల జరిగిన నష్టంపై పూర్తి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా సరిత తిరుపతయ్య మాట్లాడుతూ, పశుపోషణపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు ఇలాంటి ప్రమాదాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని అన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి వెంట నిలుస్తుందని భరోసా ఇచ్చారు.






