2 September, 2026 | 9:45 AM

ఎస్సార్పీ 1 గనికి 50 ఏండ్లు

02-09-2026 | 09:08am

- సెమీ మెకనైజ్డ్ విధానంలో ఉత్పత్తి...

- జాతీయ స్థాయిలో గుర్తింపు... 

- నేటి స్వర్ణోత్సవ వేడుకలకు అంతా సిద్ధం

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని(Mancherial District) శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని  శ్రీరాంపూర్ (ఎస్ఆర్పీ) - 1 భూగర్భ గని ఆవిర్భవించి నేటికి 50 ఏండ్లు పూర్తవుతుంది. శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్ ఆర్ పీ 1 గని ప్రారంభమయ్యే (1976) నాటికి శ్రీరాంపూర్ ఒక చిన్న వ్యవసాయ ఆధారిత గ్రామం. కనీస మౌళిక వసతులకు కూడా నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా అరకొర విద్య, వైద్యం సదుపాయలు కలిగి ఉండేది. 1976, సెప్టెంబర్ 2వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగల్ రావు(United AP CM Jalagam Vengala Rao) ఎస్ఆర్పీ 1 గనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడి స్థానికులు సింగరేణి ఉద్యోగాలు(Singareni Jobs) పొంది ఆర్థికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, ఈ ప్రాంతం ఒక పట్టణంగా రూపుదిద్దుకోవటంతో వివిధ వ్యాపార, కాంట్రాక్టు ఇతర పనులు విస్తరించటంతో జనాభా పెరిగి కాలనీలు, రోడ్లు, కరెంట్, ఇతర మౌళిక వసతులు, స్కూల్స్, కాలేజీలు ఇతర వసతులు ఏర్పడ్డాయి.

ఎస్సార్పీ 1 గనికి 50 ఏండ్లు పూర్తి

సింగరేణి చరిత్రలో అర్ధశతాబ్దపు ప్రగతి సాధించిన కొద్ది గనులలో ఎస్ఆర్పీ 1 గని ఒకటి. 1976లో ప్రారంభించినా, 1978 నుంచి బొగ్గు వెలికితీత ప్రారంభించారు. 50 ఏండ్లలో ఈ గని సింగరేణి సంస్థ ద్వారా విద్యుత్ అవసరాలకు కావాల్సిన బొగ్గును సరఫరా చేస్తూ రాష్ట్ర, దేశ అభివృద్దిలో కీలక భూమిక పోషిస్తోంది. ఈ గని 167 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా ఇందులో 16 హెక్టార్లలో అటవి భూమి ఉంది. అత్యంత గ్రెడియంట్ గల ఈ గని ప్రారంభించిన నాటి నుంచి దాదాపుగా నాలుగు దశాబ్దాలు వేలాది మంది కార్మికులు కాలినడకన బావిలోకి దిగి ఉత్పత్తికి బాటలు వేశారు. 2012లో మ్యాన్ రైడింగ్ సిస్టంను అందుబాటులోకి తీసుకురావడంతో ఉద్యోగులు పని ప్రదేశాలకు చేరుకునే సమయం ఆదా అవడమే కాకుండా ఉత్పత్తి మెరుగుపడింది.

సెమీ మెకనైజ్డ్ విధానంలో ఉత్పత్తి

మొదట తట్టా చెమ్మస్ తో జరిగిన బొగ్గు ఉత్పత్తి ప్రస్తుతం సెమీ మెకనైజ్డ్ విధానంలో జరుగుతుంది. సింగరేణిలోనే అత్యంత గ్రేడియంట్  ఉన్న ఎస్ఆర్పీ 1 గనిలో 2014లో ఎస్డీఎల్ యంత్రాలను ప్రవేశ పెట్టడమే ఒక రికార్డయితే, ఈ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు బ్రేక్ చేశారు. ఎస్డీఎల్ యంత్రాలు ప్రవేశ పెట్టిన మొదటి ఏడాదిలోనే 105 శాతం ఉత్పత్తి సాధించి వరుసగా 2016లో 105 శాతం, 2017లో 100 శాతం, 2018లో 102 శాతం, 2019లో ఏకంగా 135 శాతం ప్రొడక్షన్, 2020లో 103 శాతం, 2021లో 101 శాతం, 2022లో 102 శాతం సాధించగా, 2023లో రికార్డ్ స్థాయిలో 200 శాతం ఉత్పత్తి సాధించింది. 2024లో 104 శాతం, 2025లో 104 సాధించగా ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 116 శాతం ఉత్పత్తితో దూసుకెళుతోంది. గత ఏడాది శ్రీరాంపూర్ ఏరియాలోనే కాదు సింగరేణిలోనే 100 శాతం సాధించిన గనులలో ముందు వరుసలో నిలచింది.

జాతీయ స్థాయిలో గుర్తింపు

ఇక బొగ్గు ఉత్పత్తి సంస్థలలో అత్యంత కీలకమైన భద్రత, రక్షణలో ఎస్ఆర్పీ 1 గని సింగరేణిలోనే అత్యంత సురక్షితమైన గనిగా పేరు సాదించింది. కంపెనీ నిబంధనలు, రక్షణ సూత్రాలను పాటిస్తూ రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ 50, 51, 52వ వార్షిక భద్రత పక్షోత్సవాలలో వరుసగా హ్యాట్రిక్ బహుమతులు సాధించింది. ఇటీవల 56వ వార్షిక భద్రతా వారోత్సవాలలో గ్రూప్ 4 గనులలో మొదటి బహుమతి సాధించింది. అలాగే జాతీయ స్థాయిలో బొగ్గు మంత్రిత్వశాఖ నిర్వహించే రేటింగ్ లలో  2018-2019 సంవత్సరానికి గాను ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి సింగరేణి సంస్థకు, శ్రీరాంపూర్ ఏరియాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. 2020 -2021లో జాతీయ స్థాయిలో బెస్ట్ ఎన్విరాన్ మెంట్ గనిగా పీకాక్ అవార్డు గెలుచుకుంది. 2017 - 2018లో 1.2 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తికిగాను 1.6 లక్షలు సాధించి కంపెనీలోనే రికార్డు సృష్టించింది.

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన గని

ఈ నెల రెండవ తేదీన నిర్వహించే స్వర్ణోత్సవ వేడుకలకు ఎస్ఆర్పీ 1 గని ముస్తాబైంది. గనిపై నాటి శిలాఫలకం పక్కనే వజ్రోత్సవాల శిలాఫలకం, పైలాన్ ఏర్పాటు చేశారు. ఈ స్వర్ణోత్సవాలకు సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ (పా) గౌతం పొట్రు. డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఓపీ) సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమల రావు, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ తో పాటు యూనియన్ల ప్రతినిధులు హాజరుకానున్నారు.