3 July, 2026 | 2:21 AM

సర్కారు బడికి సర్పంచ్ కొడుకు..

03-07-2026 12:22 AM

గజ్వేల్, జులై 2: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చౌదరిపల్లి గ్రామ సర్పంచ్ లింగ రవి తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తన కుమారుడు ప్రదీప్ను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) చౌదరిపల్లిలో 9వ తరగతిలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు చేతుల మీదుగా గురువారం చేర్పించారు.

సందర్భంగా సర్పంచ్ లింగ రవి మాట్లాడుతూ, తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, స్వచ్ఛమైన వాతావరణం, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు వంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. చౌదరిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు నాయకత్వంలో ఉపాధ్యాయ బృందం నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు.

గత ఏడాది ఈ పాఠశాల విద్యార్థి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడంతో పాటు, 100 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాల ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అన్ని విధాలా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, ఆదరాసుపల్లి శశిధర్, శ్రీపాల్ రెడ్డి, శైలజ, వెంకటమ్మ, కనకయ్య, మమత తదితరులు పాల్గొన్నారు.