23 April, 2026 | 2:02 AM

రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

23-04-2026 12:39 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సమ్మె సక్సెస్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు ప్రారంభించిన సమ్మె బుధవారం తొలి రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సక్సెస్ అయ్యింది. తమ న్యాయమైన కోరికల సాధన కోసం ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 9 డిపోల ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా తెల్లవారు నుండే డిపోల ఎదుట కండక్టర్లు డ్రైవర్లు ఇతర కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. వరంగల్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 9 డిపోల వద్ద సమ్మె ప్రారంభించారు. కార్మికులు సమ్మెకు దిగడంతో మొత్తంగా వెయ్యికి పైగా ఆర్టీసీ, అద్దె బస్సులు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది.

రీజియన్ పరిధిలో ఆర్టీసీ రెగ్యులర్ సిబ్బందితోపాటు 600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తంగా 3,900 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. పలు డిపోల్లో అద్దె బస్సులను నడిపించడానికి అధికారులు చర్యలు తీసుకోగా అడ్డుకున్నారు. దీనితో ఆ డిపోల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు , కార్మికులు విధులు బహిష్కరించి ఆర్టీసీ బస్టాండుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనగా పలుచోట్ల ప్రైవేటు ఆపరేటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపించారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్పి మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టిఆర్పి నేతలు మద్దతు పలికారు. భూపాలపల్లి డిపో ఎదుట పిఆర్పి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణలో 30 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలని, 2025 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఆర్టీసీకి 400 రూపాయల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నిక కోసం చర్యలు తీసుకోవాలని, పరివారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి జిల్లా నేతలు ప్రణయ్ రాజ్, సంపత్, శ్రీను, లక్ష్మణ్ పాల్గొన్నారు.