ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి
గౌరెడ్డిపేట, కన్నాల, కుందన్‌పల్లి లెవల్ క్రాసింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
సంబంధిత శాఖల సమన్వయంతో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆగస్టు 28 (విజయక్రాంతి): జిల్లాలో ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి ఐడీఓసీలో కన్నాల ఆర్‌ఓబీ పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములుతో కలిసి జిల్లాలోని వివిధ లెవల్ క్రాసింగ్‌ల వద్ద కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గౌరెడ్డిపేట, కన్నాల, కుందన్‌పల్లి ప్రాంతాల్లో చేపడుతున్న లెవల్ క్రాసింగ్, అనుబంధ రహదారులు, ఆర్‌ఓబీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులకు, వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పనుల పురోగతిలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా అభివృద్ధి పనుల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు త్వరితగతిన ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఏడి సర్వేయర్ సోమేశ్వర్, ఆర్డీఓ గంగయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ భవ్‌సింగ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






