హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా రాయుడు
హైదరాబాద్, మే 5 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో సంస్కరణల దిశగా కీలక అడుగులు పడ్డాయి. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ గా నియమించింది. ఈ మేరకు ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్‌రెడ్డి ప్రకటన చేశారు.క్రికెట్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్టు తెలిపారు. అలాగే అవినీతి నిరోధక చర్యలకు మరింత బలం చేకూర్చేందుకు హెచ్‌సీఏ ప్రత్యేక యాంటీ కరప్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ యూనిట్‌కు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి విజేందర్ పింగలే వ్యవహరిస్తారని తెలిపారు. క్రికెట్‌కు సంబంధించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్ సెల్ కూడా ప్రారంభిస్తున్నట్టు హెచ్‌సీఏ వెల్లడించింది. ఇదిలా ఉంటే హెచ్‌సీఏ లీగ్ సీజన్ 2026 మే 12 నుంచి ప్రారంభించనున్నారు. మొదట ఏ, బి డీవిజన్ టీ20 మ్యాచ్ లను నిర్వహించనున్నారు. హెచ్‌సీఏ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అకాడమీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆధునిక శిక్షణా సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ జిల్లా స్థాయి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్టు హెచ్‌సీఏ స్పష్టం చేసింది.






