26 February, 2026 | 3:18 PM

ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

26-02-2026 01:22 PM

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ(Rajya Sabha Elections) ప్రారంభమైంది. మార్చి 16 రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. 10 రాష్ట్రాలలో 37 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 5 వరకు నామినేషన్ల(Rajya Sabha Nominations) దాఖలుకు అవకాశం కల్పించారు. మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాలీ అవుతున్నాయి.

రాజ్యసభ సీటు కోసం తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా మరికొందరు రాష్ట్ర నేతలు, అశావహులు ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఉన్న రెండు పదవులకు బోలెడంత మంది ఆశావహులు తహతహలాడుతున్నారు. అభిషేక్ సింఘ్వీకి(Abhishek Singhvi) మరోసారి కన్ ఫామ్ అన్నట్లుగా పార్టీలో చర్చ జోరందుకుంది. రాజ్యసభ సీటు రేసులో వీహెచ్(V. Hanumantha Rao), జీవన్ రెడ్డి, కేకే ఉన్నారు. తమకు అవకాశం ఇవ్వాలని వేం నరేందర్ రెడ్డి, జెట్టి కుసుమ కుమార్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Working President Jagga Reddy) సైతం ఢిల్లీలోనే ఉన్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తాజాగా రాజ్యసభ రేసులోకి చేరారు.

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi Party) భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరిపడ బలం లేకున్నా విప్ జారీతో రెబల్స్ కి చెక్ పెట్టే ప్లాన్ చేస్తున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఒక్కో రాజ్యసభ సీటు గెలవడానికి 41 ఓట్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కి 34 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అందులో 10 మంది రెబల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు రెండో స్థానం దక్కకుండా బీఆర్ఎస్ వ్యూహం వేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66 మంది సభ్యుల బలం ఉంది. సీపీఐ, ఎంఐఎం పార్టీల మద్దతు కలిపితే కాంగ్రెస్ బలం 74కు చేరుతోంది. మిగతా 8 మంది ఓట్ల చుట్టూ ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారిందని పార్టీల నేతలు చెబుతున్నారు.