ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన
- తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు
- హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
- వడగళ్లతో కూడిన వర్షపాతం
- రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్ పేట్, బంజారాహిల్స్, టోలిచౌకి, మణికొండ, అమీర్ పేట్,యూసఫ్ గూడ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో చినుకులు పడుతన్నాయి. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ అధికారులు ప్రకటించారు. రానున్న రెండు గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వడగళ్లతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు.
అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో వానలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఇవాళ ములుగు, భద్రాద్రి,ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జిల్లాలకు వర్ష సూచన ఉంది. రేపు నిజామాబాద్, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ వర్షాలు పడనున్నాయి. వచ్చే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నాగారంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. కాప్రా, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.








