24 March, 2026 | 1:06 PM

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి

24-03-2026 12:00 AM

ఆదివాసీ యువతి హత్యపై కలెక్టరేట్ ఎదుట నిరసన 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఆత్రం సమ్మక్క హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కు ల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో జిల్లాలో ఆదివాసీ మహిళలపై కులోన్మాద దాడులు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ రవాణా వంటి నేరాలు పెరుగుతున్నాయని ఈ పరిస్థితుల్లో ఆదివాసీ సమాజం భయాందోళనలకు గురవుతోందని పేర్కొన్నారు. అనంతర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆత్రం సమ్మక్క కుటుంబ సభ్యులు, తుడుందెబ్బ నాయకులు బుర్స పోచయ్య, గోండ్వానా కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తలండి మధుకర్, కొలావార్ సేవా సంఘం అధ్యక్షుడు పిట్టల రామ స్వామి, తెలంగాణ జన సమితి నాయకుడు నీరటి రాజన్న, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట ఆనంద్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గేడం టీకానంద్, కెవిపిఏ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు త్రివేణి, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు కొరంగ మాల, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే. రాజేందర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్  తదితరులు పాల్గొన్నారు.