సంక్షేమ శాఖలో చిన్నారులు, వృద్ధుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సంక్షేమ శాఖ లో వసతి పొందుతున్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, అవసరమైన సంరక్షణ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షఅధికారులను ఆదేశించారు.మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని క్యాడర్ దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం, బాల సదనం పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రాన్ని, అలాగే పెద్దపల్లిలోని రంగంపల్లి బాల రక్షక భవన్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆయా సంస్థల్లోని వసతి సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణ, చిన్నారులు, వృద్ధులకు అందుతున్న సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా వంటశాలలు, డార్మిటరీలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వంటశాలల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, పరిసరాల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గదుల్లో పరిశుభ్రత, తగిన సౌకర్యాలు, చిన్నారులు మరియు వృద్ధుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, అవసరమైన చోట తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
సిబ్బంది విధుల నిర్వహణపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి విధులకు హాజరై, తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయి బాధ్యతతో, సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా సంస్థల నిర్వహణపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. చిన్నారులు, వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వారి ఆరోగ్యం, భద్రత, ఆహారం, వసతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారి అవసరాలను గుర్తించి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు.ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, సంస్థల నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






