21 August, 2026 | 10:21 AM

విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత

21-08-2026 08:46 AM

జిన్నారం,ఆగస్టు 21: విద్యా మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మంత్రికుంట, చెట్లపోతారం ప్రాంతాల్లో రూ.47.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పాఠశాల ప్రహరీ గోడ, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గురువారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం ఖాజిపల్లి గ్రామంలో రూ.13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజల భద్రత మరింత మెరుగుపడటంతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పాఠశాల అభివృద్ధి పనులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయించిన హెట్రో, కెమ్ టెక్ పరిశ్రమ యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంతో పాటు పరిశ్రమల సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహ, ప్రకాష్ చారి, సురేందర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.