‘యశోదా’లో గర్భిణికి సురక్షిత ప్రసవం
గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళ
తల్లీబిడ్డలు సురక్షితం
కరీంనగర్ క్రైమ్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో కూడిన హై-రిస్క్ గర్భధారణ కేసులో యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మలక్‌పేట్ వైద్యులు తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడారు. తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ (పీఏహెచ్),జన్యుపరమైన గుండె వ్యాధి చరిత్ర ఉన్న 29 వారాలు + 1రోజు గర్భధారణలో ఉన్న 21 సంవత్సరాల గర్భిణికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి, 29 వారాలు + 2 రోజుల ముందస్తు శిశువును సురక్షితంగా ప్రసవించేలా చేశారు.
అనంతరం అత్యాధునిక ఎన్‌ఐ సీయూ సంరక్షణలో ఉంచి ముందస్తుగా జన్మించిన శిశువును కూడా ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ మహిళకు బాల్యంలో వీఎస్‌డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉంది. తీవ్ర పల్మనరీ హైపర్‌టెన్షన్ కారణంగా గర్భధారణ కొనసాగడం తల్లి ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున ప్రసూతి, కార్డియాలజీ, క్రిటికల్ కేర్, అనస్తీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో అత్యవసర ప్రీటర్మ్ లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ నిర్వహించారు.
ఈ ఏడాది జనవరి 5న ఎపిడ్యూరల్ అనస్తీషియా, సెంట్రల్ లైన్ మానిటరింగ్‌తో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తుంది. డాక్టర్ పవన్ పొద్దార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్డియాక్ హై-రిస్క్ కేసుల్లో నిరంతర హీమోడైనమిక్ మానిటరింగ్ అత్యంత అవసరం అన్నారు. డాక్టర్ సత్యప్రియ సాహూ మాట్లాడుతూ 29 వారాల ముందస్తు శిశువుల ప్రాణరక్షణకు సమయానికి సర్ఫాక్టెంట్, ఆధునాతన సంరక్షణ చాలా కీలకం అని వివరించారు. ఆ తర్వాత తల్లి, శిశువును ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. గుండె సంబంధిత గర్భధారణలు, శిశువుల అత్యవసర పరిస్థితులను నిర్వహించేందుకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి అసోసియేట్ వైట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు.




