20 August, 2026 | 5:46 PM

మంత్రి వివేక్‌తో పాలిటెక్నిక్ కళాశాలల జేఏసీ చర్చలు పూర్తి

20-08-2026 04:31 PM

హైదరాబాద్: కార్మికమంత్రి వివేక్ వెంకటస్వామితో పాలిటెక్నిక్ కళాశాలల జేఏసీ చర్చలు ముగిసింది. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం పట్ల ఆందోళన చేసిన పాలిటెక్నిక్ కళాశాలల జేఏసీ మంత్రి వివేక్ తో గురువారం సమావేశమై తమ సమస్యలను వివరించారు. ఈ విలీన నిర్ణయం వల్ల విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని, సిబ్బంది సర్వీసు విషయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా కార్మికమంత్రి వివేక్ మాట్లాడుతూ... ఈసెట్ ద్వారా కల్పిస్తున్న బీటెక్ ప్రవేశాలు, బీటెక్ లో లాటరల్ ఎంట్రన్స్ యథాతథంగా ఉంటాయని తెలిపారు. పాలిటెక్నిక్ ల బలోపేతం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని, పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకే జీవో తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. మన విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి విదేశాలకు పంపటం నేరమా?, కేటీఆర్ వంటి ధనవంతుల పిల్లలు విద్య కోసం విదేశాలకు వెళ్లటం లేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ విదేశాల్లో చదివి ఉద్యోగం చేసిరాలేదా? అని మంత్రి వివేక్ అడిగారు.