7 April, 2026 | 3:05 AM

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి

07-04-2026 01:07 AM
  1. ఈవీఎంల సురక్షిత నిల్వ కోసం గోదాంల ఏర్పాటు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మహబూబాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయపక్షాలు సహకరించాలని, ఈవీఎం భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. హనుమకొండ సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను సీఈసీఓ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్ల నిల్వ గదులను పరిశీలించారు. భవన ప్రాంగణంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు.

తదనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఈ గోడౌన్ నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఈవీఎంలను సురక్షితంగా నిల్వ చేయడం, అన్ని భద్రతా ప్రమాణాలను పాటించడం అని తెలిపారు. ఈ గోడౌన్లో 24 గంటలపాటుభద్రతా ఏర్పాట్లు ఉంటాయని, పోలీస్ బందోబస్తు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి అన్ని చర్యలు అమల్లో ఉంటాయని చెప్పారు.

గోడౌన్ను ఓపెన్ చేసే ప్రతి సందర్భంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. త్వరలో రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలో  ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించబడుతుందని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల వివరాలను సరిచూసి వారి స్థానం గుర్తించడం జరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రతి పార్టీ తమ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని సూచించారు. ఏజెంట్లు స్థానికంగా ఉండే, పోలింగ్ బూత్ పరిధిలోని వ్యక్తులే కావాలని తెలిపారు. వారికి అవసరమైన గుర్తింపు కార్డులను పార్టీలు అందించాలన్నారు. ఏవైనా సమస్యలు గమనించిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ, గోడౌన్లో సీసీటీవీ, ఫైర్ ప్రొటెక్షన్ వంటి అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షిఫ్టింగ్కు ముందు అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూముల నుండి పటిష్ట భద్రత మధ్య రేపటినుంచి ఈవీఎంలను కొత్త గోడౌన్కు తరలించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులు విచ్చేసి పరిశీలించాలని కోరారు. ప్రతి కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేస్తున్నారని, అన్ని పార్టీల నుంచి మంచి సహకారం లభిస్తున్నదని పేర్కొన్నారు.

సమావేశం అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, బీహార్ అదనపు సీఈవో ప్రశాంత్ కుమార్ లను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, అదనపు జిల్లా కలెక్టర్ ఎన్. రవి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.