6 May, 2026 | 2:39 AM

కుమ్మర్లలో రాజకీయ చైతన్యం రావాలి

06-05-2026 01:18 AM
  1. ఆ సమాజంలో ఎమ్మెల్యేలు ఒక్కరూ కాలేదు
  2. మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్రరావు

ఖైరతాబాద్, మే 5 (విజయక్రాంతి): రాష్ట్రం లో కుమ్మరి సమాజానికి చెందిన వారు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని, తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన తెలంగాణ కుమ్మరి సర్పంచ్‌ల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించా రు. సభకు హాజరైన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, బహుజనవర్గాల నాయకులకు ఆయన అభినందించారు.

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన 94 మంది కుమ్మ రి సర్పంచులు, 150 మంది ఉప సర్పంచులు, 1500 మంది వార్డు సభ్యులను అభినందించారు. పెద్ద ఎత్తున సర్పంచ్‌లను సన్మానిం చారు. రాష్ట్రంలో కుమ్మరి జనాభా సుమారు 1.2 శాతం ఉన్నప్పటికీ, 12 వేల సర్పంచుల్లో కనీసం 150 మంది ఎన్నిక కావాల్సి ఉండగా, 94 మందే ఎన్నిక కావడం గమనించాల్సిన విషయమన్నారు. అయినప్పటికీ ఇది భవిష్యత్తు రాజకీయ శక్తికి బలమైన పునాదిగా భావించాలన్నారు.

ఎన్నికైన ప్రతినిధులను సన్మానించేందుకు కృషి చేసిన సంగెం సూర్యారావును ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ స్థాయి నాయకత్వం భవిష్యత్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎదగాలని, బీసీలు, ముస్లింలు, ఇతర బహుజన వర్గాల నాయకులు శాసనసభల్లోకి ప్రవేశిస్తేనే వారి సామాజిక స్థితి మారుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రాతినిధ్యంపై మాట్లాడిన ఆయన, 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కుమ్మ రి సమాజం 1.02 శాతం జనాభా ఉన్నప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని పేర్కొన్నారు.

అదే సమయంలో రెడ్డి సమాజం 4.06 శాతం జనాభాతో 43 మంది ఎమ్మెల్యేలు, కమ్మ 0.68 శాతం జనాభాతో 4 మంది, వెలమ 0.28 శాతం జనాభా తో 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని తెలిపారు. తాజా కుల గణన సర్వే ప్రకా రం కుమ్మరి సమాజం 1.2 శాతానికి పెరిగినా, రాజకీయ ప్రాతినిధ్యంలో మార్పు రాలేదన్నారు.కమ్మ 1 శాతం, లమ 0.4 శాతం, రెడ్డి 4.8 శాతానికి చేరుకున్నప్పటికీ, ఎమ్మెల్యేల సంఖ్యలో అసమానత కొనసాగుతోందన్నారు. కుమ్మరి సమాజానికి ఇప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం వ్యవస్థలోని అసమానతకు నిదర్శనమని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చడానికి సమాజం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

మహానేత కాన్షీరాం సిద్ధాంతాలను ఉదహరిస్తూ జనాభా శాతాన్ని ఓటుగా, ఓటును శక్తిగా, శక్తిని పాలనగా మార్చుకోవాలి అని అన్నారు. కుమ్మరి సమాజం ఒకే వేదికపైకి రావాలని, గ్రామస్థాయి రాజకీయ చైతన్యాన్ని పెంపొందించాలని సూచించారు. ఓట్లు చెల్లాచెదురుగా కాకుండా ఒకే దిశలో కేంద్రీకరించా లని, స్వంత నాయకత్వాన్ని నిర్మించుకోవాలని, యువతను రాజకీయంగా ముందుకు తీసుకురావాలని కోరారు.

తక్షణ లక్ష్యంగా కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని, ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ఏఐబీఎస్పీ వంటి బహుజన సం స్థలను బలోపేతం చేసి, సమాజ సమస్యలను రాజకీయ అజెండాగా మలచాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ తిరుమలి ప్రసంగం సభికులను ఆలోచింపజేసింది. ఆయన కుమ్మరి సమాజం ఐక్యత, రాజకీయ చైతన్యం, స్వయం నాయకత్వంపై ఉద్బోధనాత్మకంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. యువ నాయకుడు కొల్లూరి అర్జున్ ఈ సమావేశాన్ని జయప్రదం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు.

విజయకుమార్ నరసింహారావు తదితర బహుజన నాయకులు పాల్గొన్నారు. సంగెం సూర్యారావు అధ్యక్షత వహించిన ఈ మహాసభ ఒక ఉద్యమానికి నాంది కావాలని, సమాజ హక్కులు సాధించే దిశగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్, రిటైర్ ప్రొఫెసర్ పార్థసారథి, డాక్టర్ రమేష్, యువ నాయకురాలు కీర్తన ఇంకా ఇతరులు పాల్గొన్నారు.