22 June, 2026 | 5:17 PM

పిల్లకాల్వల పనులు.. పెండింగ్ రోడ్ల పనులు పూర్తి చేయాలి

22-06-2026 03:39 PM

బెజ్జంకి: డి-7 కాల్వ నుంచి ప్రతిపాదించిన పిల్లకాల్వల నిర్మాణాన్ని, మండలంలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు గతంలో సర్వే చేసిన D7 పిల్లకాల్వల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో పిల్లకాల్వల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.

అలాగే బెజ్జంకి–బేగంపేట, పోతారం–శనిగరం రహదారుల పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, కల్లూరి బాలమల్లు, బోనగిరి శ్రావణ్, దొంతరవేణి మహేష్ తదితరులు పాల్గొన్నారు.