22 June, 2026 | 5:30 PM

ఒకటే "కూర"... "అన్నం"...తో విద్యార్థులకు భోజనం...!

22-06-2026 04:06 PM

ఇంచార్జీ ఎంఈఓ పాఠశాలకు నిబంధనలు వర్తించవా...?

మెనూ ప్రకారం విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం

నీళ్లతో కూడిన కూరను వండి పెట్టిన వైనం...

వత్తాసు పలుకుతున్న పాఠశాల ఉపాధ్యాయులు...

కొత్తబాది ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్ విద్యార్థుల గోస..

జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులు స్పందించేనా...

బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రారంభించింది. పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ అల్పాహారంతో పాటు ఇంటిలో తినే భోజనం గా ఉండేందుకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని నిత్యవసర సరుకులు కూరగాయలు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రతినెల బిల్లులు మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం క్షేత్రస్థాయిలో ఏ మాత్రం అమలు కావడం లేదు అనేది ఆరోపణలు రోజురోజుకు ఏదో ఒకచోట వినిపిస్తూ ఉన్నాయి.

ప్రభుత్వం మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు కూరగాయలతో కూడిన భోజనం వండి పెట్టాలని అలాగే సాంబారు తో పాటు గుడ్డు అరటిపండు వంటి అందజేయాలని ఆదేశించినప్పటికీ ఏదో ఒకచోట విద్యార్థులకు ఘోష తప్పడం లేదనేది నిజమే అనిపిస్తుంది ఈ సంఘటన. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొత్త బాది ప్రభుత్వ ప్రాథమిక, హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు ఒకే కూర అన్నం తో కూడిన భోజనాన్ని పెడుతూ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు ఇంచార్జ్ ఎంఈఓ గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు కొత్తబాది జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

సాక్షాత్తు ఇంచార్జ్ ఎంఈఓ పాఠశాల లోనే ఇలాంటి దుస్థితి నెలకొంటే మిగతా పాఠశాలలో ఎలాంటి దుస్థితి ఉంటుందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. కొత్త వారి ప్రభుత్వ పాఠశాలలో నీళ్ల చారు తో కూడిన దొండకాయ కూరను వండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు రోజు మెనూ ప్రకారం ఒక కూర ఒక సాంబార్ వండి పెట్టాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఇన్చార్జి ఎంఈఓ ఉన్నాడు కదా ఎవరు అడిగే వారు లేరు అంటూ దర్జాగా ఇస్టారితీన మధ్యాహ్న భోజనాన్ని నిబంధనలకు విరుద్ధంగా వండి పెడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇంత జరుగుతున్న ఇంచార్జ్ ఎంఈఓ పర్యవేక్షణ చేయకపోవడం అలాగే ఇతర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించకపోవడం తన పని తీరుకు నిదర్శనమని పలువురు పేర్కొనడం గమనార్హం. నీళ్ల చారు తో కూడిన కూరను వండి పెడుతున్న పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం మధ్యాహ్న భోజన నిర్వాహకులకే వత్తాసు పలుకుతూ బాగుందిలే అంటూ సమాధానాలు చెపుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం విశేషం. కొత్తబాది ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయుల తీరు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఏదేమైనా అంటే మాది లోకల్ మాకు ఎవరూ ఏమనరు ఏదైనా చేస్తామంటూ చెప్పడం పట్ల ముక్కున వేలు వేసుకోవడం వారి పనితీరుకు నిదర్శనం అని పేర్కొంటున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించి విద్యార్థులకు నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం వండి పెట్టాలని కొంతమంది ఉపాధ్యాయుల వ్యవహార శైలి మార్చుకునే విధంగా ఇన్చార్జి ఎంఈఓ నాగేశ్వరరావు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులు స్పందించి విచారణ చేపట్టి విద్యార్థులకు నాణ్యమైనా భోజనం అందే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.