పల్లా దుర్గయ్య ప్రబంధ సౌరభం
తెలంగాణ అనగానే కాకతీయుల రాజధాని వరంగల్లు గుర్తుకువస్తుంది. వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామం, మహాకవులకు, పండితులకు పుట్టినిల్లు. పల్లా దుర్గయ్య స్వగ్రామం ఈ మడికొండే. దుర్గయ్య 25- తేదీన పల్లా నరసమ్మ, పాపయ్య దంపతులకు జన్మించాడు. ఈయన తల్లిదండ్రులకు ఐదో సంతానం. తండ్రి వ్యవసాయంతోపాటు పౌరోహిత్యం కూడా చేసేవారు. కానీ దుర్గయ్యకు పౌరోహిత్యం అబ్బలేదు.
దుర్గయ్య 3వ అన్న మడికొండ సత్తయ్య మంచి హరికథకులుగా పేరు గాంచినారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అర్ధ శతాబ్దికి పైగా హరికథలు వినిపించారు. దుర్గయ్యకు వారి తల్లి వల్ల చదువు పట్ల శ్రద్ధ కలిగింది. పైగా బాల్య మిత్రులైన కాళోజీ, వానమామలై సోదరులు దుర్గయ్యను ప్రోత్సహించడం వల్ల కూడా విద్యపట్ల శ్రద్ధ వహించారు.
బిరుదురాజు రామరాజుగారు, అముదాల కృష్ణమూర్తి మిత్రులే అయినప్పటికీ దుర్గయ్య కంటే చిన్నవారు. కానీ వారి స్నేహం గొప్పది. దుర్గయ్య మడికొండలో ప్రాథమిక విద్యాభ్యాసం, హనుమకొండలో హైస్కూల్ వరకు చదువుకున్నారు. మడికొండకు హనుమకొండ 12 కి.మీ దూరం. రోజూ నడిచి వెళ్లవలసి వచ్చేది బడికి. ఈ ప్రయాణ అలసట వల్లనూ, ఆర్థికంగా పేదవారు కావడం వల్లనూ బాల్యం లోనే దుర్గయ్య అనారోగ్యానికి గురయ్యారు.
ఐనా పట్టు విడువని విక్రమార్కు డై చదువులో అందరికంటే మిన్నగా రాణించారు. దుర్గయ్య మీద బహుభాషా కోవిధులైన వానమామలై వేంకటాచార్యుల ప్రభావం ఉంది. దుర్గయ్యకు మెట్రిక్యులేషన్లో ఉండగానే పెళ్లైంది. ఐనా ఆయన వరంగల్‌లో ఇంటర్ చదివి, హైదరాబాద్లో పరీక్ష రాసి పాసైనారు. ఆ తర్వాత 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో బీఏలో చేరి 1940లో అందులో ఉత్తీర్ణులైనారు. ‘వందేమాతరం’ ఉద్యమం కారణంగా ఒక సంవత్సరం వృథా ఐంది.
అదే ఏడాది తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో స్నాతకోత్తర తరగతులు మొదలు కావడం, అందు లో దుర్గయ్య విద్యార్థిగా చేర డం జరిగింది. అంతేకాక, 1942లో జరిగిన ఎంఏ తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులై మొత్తం విశ్వవిద్యాలయంలోనే పట్టభద్రులైన తొలి ఎంఏ తెలు గు విద్యార్థిగా కీర్తికెక్కారు. మడికొండ నుంచి హైదరాబాద్‌కు మడికొండ నుంచి హనుమకొండకు వెళ్లడానికే కష్టమైన రోజుల్లో, హనుమకొండ నుంచి హైదరాబాదుకు రావడం ఇంకెంతో కష్టం. ఐనా ఆయన హైదరాబాద్‌కు వచ్చి చదువుకోవడంలో వారి 3వ అన్న సత్తెన్నారాయణ ప్రోత్సాహం ఎంతగానో ఉంది.
అన్నగారు చూపే అన్నవస్త్రాల నిశ్చింతతో దుర్గయ్యకూడా గవని వేషం వేయవలసి వచ్చింది. వచ్చిన డబ్బుతో మొదటిసారి హైదరాబాద్ వచ్చి అప్పటి... తెలుగుశాఖ అధ్యక్షు లైన రాయప్రోలు సుబ్బారావును కలుసుకోవడం, వారి సహాయంతో సీటు రావ డం, చదువు కొనసాగడం దుర్గయ్య విద్యాభ్యాసంలో మరవలేని సంఘటనలు. ఆయన 1943లో చాదర్ఘాట్‌లో కొత్తగా మొదలైన జూనియర్ కళాశాలలో మొదటి పార్ట్ టైమ్ లెక్చరర్‌గా చేరి, తర్వాత పూర్తికాలపు లెక్చరర్‌గా 13 ఏండ్లు పనిచేశారు.
ఆ తర్వాతనే ఉస్మానియా వర్సిటీ నిజాం కళాశాలలో ఆచార్యులుగా నియమితులై 1976లో పదవీ విరమణ చేశారు. దుర్గయ్య ఇల్లు కవులతో, పండితులతో నిండి సరస్వతీ నిలయంగా భాసించేది. ప్రతిరోజు మహా సాహిత్య గోష్ఠులు జరిగేవి. వాటిలో దాశరథి, రామరాజు, నారాయణరెడ్డి, కాళోజీ, వానమామలై మొదలైన దిగ్గజ పండితులు పాల్గొనేవారు. ఇంకా ప్రముఖ కథా రచయితలు డి.రామలింగం, భాస్కరభట్ల కృష్ణారావు పాల్గొనేవారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వట్టికోట ఆళ్వారుస్వామి స్థాపించిన ‘దేశోద్ధారక గ్రంథమాల’ దుర్గయ్య ఇంట్లోనే నడిచేది. సమావేశాలకే కాక, గ్రంథాలయానికి వచ్చే ప్రముఖులతో ఈ ఇల్లు సందడి గా ఉండేది. దుర్గయ్య పీహెచ్‌డీకి తీసుకున్న పరిశోధనా అంశం ‘ప్రబంధ వాఙ్మ య వికాసం - రాయల యుగం’ అనేది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షకులు. వారు రచించిన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని తెలియజేసే సంఘటనను వివరించక తప్పదు.
‘సమగ్ర ఆంధ్ర సా హిత్యం’ రూపకల్పనలో తలమునకలైన ఆరుద్ర ఒకరోజు పల్లా దుర్గయ్య ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. వారికి తోడుగా దాశరథి, గుమ్మ డి వెంకటేశ్వరరావు ఉన్నారు. పల్లా దుర్గయ్య ఇంటికి ఎవరు వెళ్లినా రుచికరమైన భోజనం, ఫలహారాలు లభించేవి. ఆరుద్ర కూడా ఫలహారం స్వీకరించి ‘మీ సిద్ధాంత గ్రంథం ఒకసారి చూసి ఒక పావుగంటలో ఇస్తా’ అని థీసిస్ తీసుకొని దుర్గయ్య స్టడీ రూమ్లోకి వెళ్లారట. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా ఆరుద్ర రూ మ్ నుంచి బయటకు రాలేదట.
బహుశా ఆరుద్రకు దుర్గయ్య పరిశోధన గ్రంథం ఎంతగా నచ్చిందని వేరుగా చెప్పవలసిన పనిలేదు. దుర్గయ్య మీద కళాశాల్లో ప్రభా వం చూపిన ఆచార్యులు రాయప్రోలు, ఖండవల్లి. వీరితోపాటు కురుగంటి సీతారామయ్య కూడా ప్రభావం చూపారు. రాయప్రోలు పద్య పాఠం చెప్పేటప్పుడు కుర్చీలో కూర్చునేవారు కాదు. నిలబడి పద్యాన్ని గొంతెత్తి చదివేవారు. వారి ప్రభావం దుర్గయ్య మీద కూడా పడింది. అప్పట్లో ఉర్దూలో బీఏ చదివే ఏర్పాటు ఉండేది.
దుర్గయ్య బీఏ దాకా ఉర్దూ మీడియంలోనే చదివారు. తెలుగు ఇచ్ఛిక అంశం మాత్రమే. తెలుగు భాషది విచిత్రమైన పరిస్థితి. ఇంటర్‌లోనూ, ఎంఏలోనూ ఒక్కరం టే ఒక్కరే తెలుగు విద్యార్థి. వారే దుర్గయ్య. ఇక బీఏలో వారికి ఒక తోడు దొరికింది. ఆయనే రామచంద్రారెడ్డి. తెలుగు చదివి ఏంచేస్తారని హేళన చేసేవారు ఆ రోజుల్లో ఉన్నారు. ఉర్దూకే గౌరవం. ఐనా, తెలుగులో చదివి, తెలుగు గౌరవాన్ని ఇనుమ డింపజేసిన దుర్గయ్య ‘దుర్గమే’ అని చెప్పవచ్చు.
తెలుగును ఇచ్ఛికంగా చదివి, తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడు చాదర్ఘాట్ కాలేజీలో నెలకు వారికి లభించే జీతం ఎంతో తెలు సా? 66 రూపాయలే. ఐనా శాశ్వత ఉద్యోగాన్ని వదిలి కళాశాల అధ్యాపకుడిగా రావ డం వారి అదృష్టంగానే భావించారు. దుర్గయ్యకి ఆంధ్రసాహిత్య చరిత్ర అంటే ఎంతో ఇష్టం. పరిశోధనలో ఉద్ధండులైన దుర్గయ్య దగ్గర చేసిన పరిశోధకుల్లో ముదిరా జు రంగారావు, జీవీ సుబ్రహ్మణ్యం ఉన్నా రు. దుర్గయ్య ఒక గొప్ప పరిశోధకులే కాదు, గొప్ప సృజనాత్మక కవి కూడా. వారి ‘ప్రబంధ వాఙ్మయ వికాసం రాయల యుగం’ అనే పరిశోధన గ్రంథం అటు పండితులకు ఇటు పరిశోధకులతో పాటు, సాహిత్య విద్యార్థులకు నేటికీ ఒక ఆధార గ్రంథంగా భాసిస్తుంది.




