ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, 29 ఏప్రిల్( విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంతో పాటు, వేసవికాలంలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పురోగతిపై జిల్లా, మండల స్థాయి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని దూర ప్రాంతాల మిల్లులకు కాకుండా ములుకనూరు, ఎల్కతుర్తి పరిధిలోని సమీప మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ మోడల్ స్కూల్ వద్ద మురుగునీరు నిల్వ ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో మరింత వేగం తీసుకురావాలని, లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సహకరించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. గృహ ప్రవేశాలు త్వరితగతిన నిర్వహించేలా చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్ను ఆదేశించారు.
మండలంలోని రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు పెయింటింగ్ పనులు చేపట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయంలో సర్పంచులు కూడా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను సమయానికి పూర్తి చేయాలని, కార్మికులకు బిల్లులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సాగునీటి కాలువలు పూడుకుపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని, చెరువుల నీటిని సక్రమంగా వినియోగించి పంటలకు సాగునీరు అందించేలా ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, డ్రాప్‌ఔట్లను పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి విద్యా, ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జనగామ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
వంగరలోని పీవీ విజ్ఞాన కేంద్రం పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల కోసం రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్డీవో మేన్ శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా ఉద్యాన అధికారి అనసూయ, డీఈవో గిరిరాజ్ గౌడ్, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, ఎంపీడీవో వీరేశం, తహసీల్దార్ రాజేష్, ఇతర అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.






