"స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?
- చైర్ పర్సన్ ఆదేశాలు బేఖాతరు
- జనావాసాల మధ్య స్క్రాప్ దుకాణాలు
- అధికారుల తీరుపై అనుమానాలు
బెల్లంపల్లి, జూలై 2: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో అధికారుల ఇష్టారాజ్యం ప్రజలకు ఇబ్బందిగా మారింది. ప్రజా అవసరాలను తీర్చాల్సిన అధికారులు సమస్యలను పెంచిపోషిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారుపుర ప్రజలు. అనుమతులు లేకుండా పట్టణంలో పలు వార్డుల్లోవెలిసిన స్క్రాప్ దుకాణాలు ప్రజల కు శాపంగా మారాయి. జనావాసాల మధ్య, ప్రధాన రహదారుల పక్కనే యదేచ్ఛగా స్క్రాప్ దుకాణాలు కొనసాగుతున్నాయి. చిరకాలంగా వాటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ స్క్రాప్ సమస్యను ఎన్నో సార్లు ఆయా వార్డుల ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఏండ్ల తరబడి స్క్రాప్ సమస్యకు పరిష్కారమే కానరాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే క్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి వార్డుల్లో పర్యటించారు.
అందులో భాగంగా పలు వార్డుల్లో తిష్ఠ వేసిన స్క్రాప్ దుకాణాల సమస్య ఆమె దృష్టికి వచ్చింది. వాటిని మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి స్వయంగా పరిశీలించారు. స్క్రాప్ దుకాణాలను తొలగించాలని ప్రజలు ఆమెకు మొరపెట్టుకున్నారు. ప్రజల ఇబ్బందులను స్వయంగా ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. దీంతో వార్డుల్లో ఉన్న స్క్రాప్ దుకాణాలను ఎత్తివేయాలని ప్రజల డిమాండ్ మేరకు చైర్ పర్సన్ దావస్వాతి స్క్రాప్ దుకాణాలను ఎత్తివేయాలని అధికారులకు అక్కడిక్కడే ఆదేశాలు ఇచ్చారు. చైర్ పర్సన్ ఆదేశాలు ఇచ్చి నెలరోజులు దాటిపోయింది. ఆదేశాలు మాత్రం ఇప్పటికి అమ్మలోకి రాలేదు.ఎక్కడి స్క్రాప్ దుకాణాలు అక్కడే ఉండిపోయాయి. ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..స్వయంగా చైర్ పర్సన్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు విస్మరించడంపై పట్టణంలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
స్క్రాప్ వ్యాపారుల ప్రలోభాలకు అధికారులు తలొగ్గి పోయారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. స్క్రాప్ దుకాణాల బాధిత ప్రజలు మాత్రం స్క్రాప్ వ్యాపారుల తీరుపై మండిపడుతున్నారు. అధికారులు ముడుపులు పుచ్చుకుని స్క్రాప్ వ్యాపారులకు వత్తాసుపలుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దూకుడికి కళ్ళెం వేసి పరిపాలన వ్యవహారాన్ని చైర్ పర్సన్ చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల సమస్యలపై అధికారుల్లో త్రికరణశుద్ధి లోపించిందనడానికి స్క్రాప్ వ్యవహారమే సాక్షీభూతం. కాగా చైర్ పర్సన్ పరిపాలన రంగం పై పట్టు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ముఖ్యం. అధికారగణం ప్రజలకు సేవకులనే విషయాన్ని విస్మరిస్తున్నది. ఇప్పటికైనా చైర్ పర్సన్ దావస్వాతి అధికారుల్ని గాడిలో పెట్టాల్సి అవసరాన్ని తీవ్రంగా పరిగణించాలి. పరిపాలన దక్షతలో మెతక వైఖరి ఎంతమాత్రం పనికిరాదు. ఎవరైనా ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. ఈ సత్యాన్ని అందరూ పాటించాలి. ఇందుకు ఎవరూ అతితులు కారు.. అధికారుల నిర్లక్ష్యంపై చైర్ పర్సన్ పరిపాలన పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజాజీవితంపై కుంపటిగా మారిన స్క్రాప్ దుకాణాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితు వార్డుల ప్రజలు కోరుతున్నారు.






