24 June, 2026 | 4:33 PM

పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు

24-06-2026 03:07 PM

ఇల్లందు, జూన్ 24 (విజయక్రాంతి): ఇల్లందు మండల అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఓ అందమైన నెమలి స్థానిక సుభాష్‌నగర్ పాఠశాల ఆవరణలో ప్రత్యక్షమై విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఉదయం పాఠశాల ప్రాంగణంలో నెమలిని గమనించిన చిన్నారులు ఆనందంతో కేరింతలు కొట్టగా, సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని జాతీయ పక్షిని చూసి మురిసిపోయారు. కొంతసేపు పాఠశాల పరిసరాల్లో సంచరించిన నెమలిని ఎలాంటి హాని జరగకుండా స్థానికులు జాగ్రత్తగా గమనిస్తూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది నెమలిని సురక్షితంగా స్వాధీనం చేసుకుని స్థానిక అటవీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా నెమలి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఈ అరుదైన పక్షి పట్టణ ప్రాంతంలో కనిపించడం విశేషమని పేర్కొన్న అధికారులు, నెమలిని కిన్నెరసాని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు వెల్లడించారు. కాగా పాఠశాలలోకి నెమలి రావడంతో చిన్నారులు ఎంతో ఉత్సాహానికి లోనై దానితో ఫోటోలు దిగుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కొద్ది సేపు పాఠశాల ఆవరణలో నెలకొన్న ఈ సందడి స్థానికులను ఆకట్టుకుంది.