1 September, 2026 | 3:22 PM

కిటకిటలాడిన మున్సిపల్ కార్యాలయం

01-09-2026 02:46 PM

ఎస్‌ఐఆర్‌ నోటీసులు చేతబట్టి.. విచారణకు పోటెత్తిన జనం 

షాద్ నగర్ సెప్టెంబర్ 1(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌(SIR) ప్రక్రియలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ(Shadnagar Municipality)లో ఓటర్ల రద్దీ నెలకొంది. ఓటు నమోదు, ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు తదితర అంశాలకు సంబంధించి తలెత్తిన సమస్యలపై అధికారులు జారీ చేసిన నోటీసులను తీసుకొని పలువురు ఓటర్లు విచారణకు హాజరయ్యారు. నోటీసులు అందుకున్న ఓటర్లు(Voters) ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో కార్యాలయం కిటకిటలాడింది. తమ వద్ద ఉన్న ఆధారాలు, అవసరమైన పత్రాలను అధికారులకు సమర్పిస్తూ ఓటర్లు తమ సమస్యలను వివరించారు.

ఓటు నమోదుకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో విచారణకు తరలివచ్చారు. ఓటర్ల(Voters)కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు, నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కమిషనర్ సునీతారెడ్డి కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు.