24-02-2026 12:09:27 AM
కోల్‌కత, ఫిబ్రవరి 23 : కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ కన్నుమూశారు. కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ముకుల్ రాయ్(71) అనారోగ్య కారణాలతో గత రెండేళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు.
కోమాలో ఉన్న తన తండ్రి గుండెపోటుతో కన్నుమూసినట్టు ముకుల్ రాయ్ కుమారుడు సుభాన్ష్ రాయ్ తెలిపారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడుగా, టీఎంసీలో రెండో శక్తివంతమైన నేతగా ముకుల్ రాయ్ పేరు పొందారు. బెంగాల్‌లో టీఎంసీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు ముకుల్‌రాయ్ మృతి విషయం తెలియగానే ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ సహా పలు పార్టీల నేతలు తీవ్ర సంతాపం తెలియజేశారు.
ముకుల్రాయ్ రాజకీయంగా తన చిరకాల సన్నిహితుడని, బెంగాల్ రాజకీయాల్లో ఆయన సేవలు చిరస్మరణీయమని మమతా బెనర్జీ కొనియారు. ముకుల్ రాయ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రాజకీయ అనుభవం, సమాజసేవ పరంగా ఆయన గుర్తుండిపోతారని అన్నారు. ముకుల్ రాయ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకున్నారు.
పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్ మృతి బెంగాల్ రాజకీయాల్లో తీరని లోటని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ అన్నారు. ముకుల్ రాయ్ మృతి తనను విషాదంలో ముంచిందని బీజేపీ నేత సువేందు అధికారి ‘ఎక్స్’లో తెలిపారు. ముకుల్ రాయ్ యువజన కాంగ్రెస్ నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల లెఫ్ట్ ఫ్రెంట్ పాలనకు చరమగీతం పాడి, టీఎంసీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక వహించారు.
2009--2014 మధ్య కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరేళ్ల పాటు టీఎంసీ సస్పెండ్ చేయడంతో 2017 అక్టోబర్‌లో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి, టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే ఏడాది బీజేపీలో చేరి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచారు. అయితే ఆ తర్వాత టీఎంసీ గూటికి తిరిగొచ్చారు.