లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు
- ఎంపీడీవో జమలారెడ్డి
బూర్గంపాడు,(విజయక్రాంతి): చదువు ఏదైనా లక్ష్యంతో చదివితేనే సత్ఫలితాలు వస్తాయని, దీనికి క్రమశిక్షణ తోడైతే సంస్కారం అబ్బుతుంది అని బూర్గంపాడు ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పినపాక పట్టి నగర్ పంచాయతీ కార్యాలయంలో పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచిన సపావట్ కనిష్కను మరియు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన ధారావత్ తేజేశ్వరి, జస్వంత్, ఐశ్వర్య, ఝాన్సీ అనే విద్యార్థులను స్థానిక సర్పంచ్ బానోత్ పద్మ, పాలకవర్గ సభ్యులతో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి స్థాయికి చేరుకుంటారని, తల్లిదండ్రులు పిల్లల నుండి ఆశించేది డబ్బు ఇంకా వేరేదో కాదని అందరిలో మంచి పేరు తెచ్చుకొని వారికి మంచి పేరు తేవాలని, మంచి ప్రయోజకులు ఐతే ఆ తల్లిదండ్రులుగా పడే సంతోషం మాటల్లో చెప్పలేనిదని అన్నారు. అందుకే ప్రతి విద్యార్థి తమ కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పడే కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోటమళ్ళ వెంకటరమణ,వార్డు సభ్యులు శ్రీను,నల్లగట్ల గీత,భూక్య పద్మ,నిఖిల్, ఫీల్డ్ అసిస్టెంట్ దారావత్ శ్రీను, సెక్రటరీ విజయ్,బానోత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






