అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి
మేడిపల్లి,(విజయక్రాంతి): బలవంతంగా అత్తను బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్తూ అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్లుడుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య (19) ఏడాది క్రితం స్నేహిత్ తో ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఇద్దరు అదే కాలనీలో నివసిస్తున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలోని మరో వీధిలో ఉంటున్నారు.
కావ్యకు ఒక అక్క కూడా ఉంది. ఏప్రిల్ 28న కావ్య అక్క తల్లిదండ్రు ల ఇంటికి రావడంతో, తల్లి కొల్లా అరుణ (39) కావ్యను కూడా రమ్మని ఇంటికి పిలిచింది. ఆరోజు మధ్యాహ్నం కావ్య తల్లి ఇంటికి వెళ్ళింది. అదే రోజు రాత్రి స్నేహిత్ అత్తకు పలుమార్లు ఫోన్ చేసి, కావ్య ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్టు తెలిసింది. దీంతో అరుణ మానసికంగా ఆందోళనకు గురైంది. మరుసటి రోజు 29న మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతుండగా, అక్కడికి వచ్చిన స్నేహిత్ అత్తతో గొడవపడి బలవంతంగా బైకుపై తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అరుణకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుండి పడిపోయిందని, స్నేహిత్, కావ్య కు ఫోన్ ద్వారా తెలిపాడు.
తొలుత అరుణను సమీపంలోని మెడిస్టార్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ లోని ఆర్ బిఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన కావ్య, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిజం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాలలో స్నేహిత్, బైక్ పై వెళుతూ అరుణతో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం హెల్మెట్ తో తలపై దాడి చేయడంతో రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుంచి ఆమె రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 సాయంత్రం మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.






