పాఠశాల ఆవరణలో కోతుల బెడద
– భయాందోళనలో విద్యార్థులు విద్యార్థుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలి. (TGVP )
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలంలోని ఖండ్‌గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సందర్శించి, పాఠశాలలోని సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయడంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద పెరిగిపోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని గుర్తించారు. కోతులు పాఠశాల ఆవరణలోకి రావడంతో విద్యార్థులు భయపడుతున్నారని, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. పాఠశాల ఆవరణలోకి కోతులు రాకుండా రక్షణ చర్యలు, సంబంధిత శాఖల ద్వారా కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యను నిర్లక్ష్యం చేసి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఖండ్‌గాం ప్రభుత్వ పాఠశాలలో కోతుల బెడదను వెంటనే నివారించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వీరేష్, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.






