2 April, 2026 | 5:59 PM

నిరంతర సంక్షేమం.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

02-04-2026 03:52 PM

అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు 

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 

అచ్చంపేట ఏప్రిల్ 02: 'వారంలో ఒక్కరోజు మాత్రమే వివిధ శాఖల అధికారులు కలిసి ఎందుకు హైదరాబాద్ కి వెళ్తున్న.. మిగతా రోజులన్నీ ఇక్కడే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న.. మీకే సమస్య ఉన్న వచ్చి నన్ను కలవండి వాటిని తప్పకుండా పరిష్కరిస్తాననీ' అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గురువారం అచ్చంపేటలోని 2, 14వ వార్డులలో నిర్వహించిన వార్డు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

కొంతమంది రేషన్ కార్డులు తొలగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. ఇకపై అలాంటి చర్యలు చేపట్టొద్దని ఇప్పటికే అధికారులు సూచించానని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు.. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్న ఇప్పటికీ కొంతమందికి ప్రభుత్వ ఉపాధ్యాయులపై నమ్మకం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అచ్చంపేట పట్టణంలో అన్ని వార్డుల్లో ప్రజలకు అవసరమైన రోడ్లు,  మురుగు కాలువలు ఇతర  మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లతో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. పట్టణ ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే కౌన్సిలర్లు, చైర్మన్ తో పాటు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని వేగవంతంగా పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కమిషనర్ మురళి,  మేనేజర్ రమేష్ నాయక్, కౌన్సిలర్లు గౌరీ శంకర్,  జి శివ, నిర్మల, కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్, నేతలు సుంకర బాలరాజు, భగత్ సింగ్, లింగం, లాలూ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.