శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని అంబగట్ట గ్రామంలోని గట్టు చెరువు శిథిలావస్థకు చేరుకుందనే విషయం తెలుసుకుని ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు యొక్క కట్ట, మత్తడిని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు కొండల మధ్యలో సహజంగా ఏర్పడిన ఈ చెరువు 300 ఎకరాల అయకట్టుకు సాగునీరు అందించడమే కాకుండా పశువులకు, అటవీ జంతువులకు తాగు నీరు అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
వెంటనే అంచనాలు తయారుచేసి తనకు అందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు.ఈ చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలిపారు.అనంతరం తాటివాడలో శిధిలావస్థకు చేరినటువంటి రోడ్ డ్యామ్ ను పరిశీలించారు. రూ. 45 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామని త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నామని తెలిపారు.






