23 July, 2026 | 1:21 PM

అరాచక పాలన సాగిస్తున్న కేంద్రం

23-07-2026 12:21 PM

ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ 

కేసముద్రం (విజయక్రాంతి): ప్రజల సమస్యలను పరిష్కరించడం, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ప్రశ్నించిన గొంతులను నొక్కాడానికి అరాచక పాలన సాగిస్తోందని, ఎందుకు ఢిల్లీ ఘటన నిదర్శనమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడానికి కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల పక్షాన నిలబడితే కేంద్ర బిజెపి సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ వారిని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, కార్పొరేట్ శక్తులకు దాసోహంగా పనిచేస్తున్నదని విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజలు సంఘటితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎదిరించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, నాయకులు గుగులోత్  దసురు నాయక్, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, నీలం దుర్గేష్, బండారు దయాకర్, బండారు వెంకన్న, ట్రాన్స్పోర్ట్ కమిటీ మెంబర్ రావుల మురళి, మార్కెట్ డైరెక్టర్లు అయ్యుభ్ ఖాన్, వసంతరావు, కదిరె సురేందర్, చిలువేరు సమ్మయ్య గౌడ్, దామర కొండ ప్రవీణ్, తండా వెంకటేశ్వర్లు, బనిశెట్టి వెంకటేష్,  తదితరులు పాల్గొన్నారు.