ఘాట్‌రోడ్డుపై నిద్రమత్తు బలి.. మహిళ దుర్మరణం
శ్రీశైలం జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొన్న కారు
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. హైదరాబాద్‌కు తరలింపు
హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా విషాదం
అచ్చంపేట, జూలై 23 : హైదరాబాద్- శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘాట్‌రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతో కారు అదుపు తప్పి రహదారి పక్కనున్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన కేసుమోల్ల లక్ష్మి (38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారును నడుపుతున్న పెరుముల నాగరాజు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. లక్ష్మి హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. స్వగ్రామమైన తుర్కపల్లికి వచ్చి చిట్టీ డబ్బులు చెల్లించేందుకు బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కుటుంబానికి ఆధారంగా ఉన్న లక్ష్మి అకాల మరణంతో భర్త, ఇద్దరు కుమారులు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న సిద్ధాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిద్రమత్తు.. మరో ప్రాణాన్ని బలిగొన్న ఘాట్‌రోడ్డు
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రమత్తులో వాహనాలు నడపడం ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు ఘాట్‌రోడ్డులో మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు, నిరంతర పోలీసు పర్యవేక్షణ అవసరమని వారు కోరుతున్నారు.






