22 March, 2026 | 1:46 AM

జీవన్‌రెడ్డితో మంత్రుల భేటీ

22-03-2026 12:18 AM
  1. పార్టీ మార్పుపై గంటకుపైగా చర్చించిన శ్రీధర్‌బాబు, అడ్లూరి 
  2. అధిష్ఠానం ఆయన విషయంలో ఆలస్యంగా స్పందించింది : మీడియాతో శ్రీధర్‌బాబు
  3. నిర్ణయంలో మార్పు ఉండదన్న జీవన్‌రెడ్డి!

జగిత్యాల, మార్చి 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని జగిత్యాలలోని ఆయన నివాసంలో శుక్రవారం మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ సమావేశమయ్యారు. జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై గంటకుపైగా చర్చించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మా ట్లాడుతూ.. గురువారం హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌తో భేటీకి గైర్హాజరైన నేపథ్యంలో.. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతం గా కలిసేందుకు వచ్చామని చెప్పారు.

జీవన్‌రెడ్డితో అనేక విషయాలపై చర్చించామని చెప్పారు. ఆయన నిబద్ధత గల నాయకుడని, పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఆయన ఎదుర్కుంటున్న ఇబ్బందులు తమతో పంచుకున్నారన్నారు. ఆయన ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ గురించేనని, అధిష్ఠానం ఆయన విషయంలో ఆలస్యంగా స్పందించిందని తెలిపారు. జీవన్‌రెడ్డి బాధ పడితే తామంతా బాధ పడుతామని, పదవుల విషయలో ఆయన ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదన్నారు. 

బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పని చేయడానికే  వచ్చారు తప్పితే.. జీవన్‌రెడ్డిలాంటి వారిని దూరం పెట్టేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కాదన్నారు. జీవన్‌రెడ్డితో చర్చించిన విషయాలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి పార్టీ వీడటంపై తన నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పినట్టు తెలిసింది.

దేవుడు శాశించాడు ఈ మానవుడు ఆచరిస్తాడు అని అన్నట్టుగా సమాచారం. జీవన్ రెడ్డి రాజీవ్‌గాంధీ ఆశయాలకు తగ్గట్లు ఈరోజు కాంగ్రెస్ లేదంటూ అసహనం వ్యక్తంచేశారని తెలిసింది. ఈనెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, జిల్లాలో నాయకులతో ఒక ఫంక్షన్ హాల్‌లో సమావేశం ఏర్పాటుచేస్తారని, అక్కడే బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తుంది. మంత్రులతోపాటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు.