ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు సహా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేసి, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగుల ఈపీఎఫ్ , ఈఎస్ఐ వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులు ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని ఏజెన్సీలు ఈ పి ఎఫ్ నిధులను సక్రమంగా జమ చేయకుండా, ఈ ఎస్ ఐ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. నెలవారీ పేస్లిప్‌లు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పెండింగ్ వేతనాలన్నింటిని వెంటనే చెల్లించడం, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఖాతాల్లో జమ చేయడం, రూ.26 వేల కనీస వేతనం అమలు చేయడం, ఈ పి ఎఫ్ నిధులు జమ చేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం, ఉద్యోగులకు పేస్లిప్‌లు, గుర్తింపు కార్డులు, డ్రెస్ కోడ్, అపాయింట్‌మెంట్ లెటర్లు అందించడం, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మమత, మాదేవి, భార్గవి, మల్లేష్, తపాటు తదితర సిబ్బంది పాల్గొన్నారు.






