మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ
అశ్వాపురం,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలో ఇటీవల 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి, హత్యాయత్నం ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అశ్వాపురం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం వివిధ ప్రజా, సామాజిక, దళిత, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిందితుడు మహమ్మద్ గౌస్‌కు చట్టప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ సెంటర్ నుంచి గౌతమ్‌నగర్ కాలనీ గేటు వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్నారులు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు సమాజానికి తీవ్ర మచ్చగా మారాయని, ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై వేగవంతమైన విచారణ చేపట్టి కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల భద్రతకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని, నేరాలను అరికట్టేందుకు కఠినమైన వ్యవస్థను అమలు చేయాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలు, యువకులు, ప్రజలు నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తూ బాధిత బాలికకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, సభ్యులు, యువజన ప్రతినిధులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






