10 April, 2026 | 2:13 AM

ఏజెన్సీ- నాన్ ఏజెన్సీ సుడిగుండంలో మంగపేట

10-04-2026 12:32 AM

2011 నుండి జరగని సర్పంచ్ ఎన్నికలు

మంగపేట, ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ) : మంగపేట మండలంలో గ్రామ పంచాయతీలకు 2011 నుండి ఎన్నికలు జరగలేదు. పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో గ్రామాలలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. గ్రామాభివృద్ధి గురించి పట్టించుకునే నాధుడు లేకపోవడంతో మండలంలోని గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. మంగపేట మండలంలో గతంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన పంచాయతీలలో భాగంగా మంగపేట మండలంలో కొత్తగా మరో ఏడు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.

దీంతో మండలంలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 25కి చేరింది. పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో ఆయా గ్రామాలలో సమస్యలు పేరుకుపోయాయి. మండలంలోని గ్రామ పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో మండలంలో పలు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.

పంచాయతీలకు సర్పంచులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి మమేకమై జీపీ నిధులను సక్రమంగా వినియోగించడం లేదని, మండలంలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. 

మంగపేట మండలం ఏజెన్సీయా ? నాన్ ఏజెన్సీయా ? అనే అంశంపై గిరిజనేతరులకి, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తుండడంతో గత మూడు దఫాలుగా మంగపేట మండలంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అంతే కాకుండా 2014లో ఎంపీటీసీలకు జనరల్ విధానంలో ఎన్నికలు జరిగినా గిరిజన, గిరిజనేతర వివాదంతో ఎంపీటీసీలుగా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.

2019లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మంగపేట గ్రామ పంచాయతీల సర్పంచులను  వంద శాతం గిరిజనులకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రొటేషన్ పద్దతిలో మంగపేట మండలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని గిరిజనేతరులు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులకు వినతిపత్రాలు అందచేశారు.

అంతే కాక మండలంలో గ్రామ పంచాయతీలను వంద శాతం గిరిజనులకు కేటాయించడాన్నినిలిపి వేయాలని గిరిజనేతరులు అడ్డుపడ్డారు. ఫలితంగా పంచాయతీ ఎన్నికలను చివరి క్షణంలో చేయడంతో మంగపేట మండలంలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేశారు. అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్ కు సంబందించిన ఎన్నికలు కూడా నిలిచిపోయాయి. సుమారు 15 ఏండ్లుగా మండలంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో మండలంలో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. 

జీపీ నిధులు దుర్వినియోగం 

 మంగపేట మండలంలో గ్రామ పంచాయతీలకు సుమారు పదిహేను సంవత్సరాల నుండి నుండి ఎన్నికలు జరగలేదు. ఇన్నేళ్ళుగా పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో మండలంలోని గ్రామాలలోని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. గిరిజన పల్లెల గురించి అయితే పట్టించుకునే నాధుడే లేడు. గిరిజన గ్రామాలలో త్రాగు నీరు డ్రైవేజీ, అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి.

గ్రామ పంచాయతీలకు పాలక వర్గం లేకపోవడంతో మండలంలో పలు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీలకు సర్పంచులు లేకపోవడంతో అధికారులు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో గతంలో మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పని చేసిన పలువురు సస్పెండ్ అయ్యారు.

మంగపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన మాలోత్ హీరు నాయక్ ను టెర్మినేట్ కూడా చేశారు. నిధులు దుర్వినియోగం ఆరోపణలపై సస్పెండ్, టెర్మినేట్ అయిన పంచాయతీ కార్యదర్శులను కొన్నాళ్ళకు మళ్ళీ విధుల్లోకి తీసుకోవడంతో పంచాయతీ కార్యదర్శులలో ఏ మాత్రం భయం లేక నిధుల దుర్వినియోగం ప్రవాహానికి అడ్డులేకుండా పోతుంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై ద్రుష్టి సారించి పంచాయతీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.

- పోలెబోయిన ఆదినారాయణ, ఆదివాసి ప్రజా సంఘాల జేఎసి మండల అధ్యక్షుడు