23 August, 2026 | 3:40 PM

అంజయ్యనగర్ భవనం కూలిపోవడంపై మాదాపూర్ టీపీబీఓ సస్పెన్షన్

23-08-2026 02:57 PM

శేరిలింగంపల్లి,ఆగస్టు 23(విజయక్రాంతి): గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో శనివారం మధ్యాహ్నం కూలిపోయిన ఏడంతస్తుల అక్రమ భవనం ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసి) కమిషనర్ జి. శ్రీజన మాదాపూర్ సర్కిల్-50 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ యు. సంతోష్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేశారు.ఆ భవనం కేవలం 48 నుంచి 60 గజాల చిన్న స్థలంలో, నాలా పక్కన అనుమతులు లేకుండా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తులు, పెంట్‌హౌస్ ఉన్న ఈ నిర్మాణం శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు అకస్మాత్తుగా కూలిపోయింది. శిథిలాల కింద నుంచి మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మహతాబ్, ఉమేష్ మృతదేహాలు వెలికి తీశారు. పక్కనున్న అపార్ట్‌మెంట్‌లకు కూడా నష్టం జరిగింది. కొందరికి గాయాలు అయ్యాయి.భవనం యజమానులు ఫర్హీన్ సిద్ధిక్, మహ్మద్ సాజిద్. సాజిద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేస్తున్నారు.

రైడూర్గం పోలీస్ స్టేషన్‌లో అతనిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదైంది.సీఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం జూన్ 17ననే ఈ అక్రమ నిర్మాణంపై నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేసినా పనులు ఆగలేదు. టీపీబీఓ సంతోష్ కుమార్ అక్రమ నిర్మాణాన్ని ఆపకపోవడం వల్ల ప్రాణనష్టం జరిగిందని, ప్రజా భద్రతకు ముప్పు వచ్చిందని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయన సస్పెన్షన్‌లోనే ఉంటారు.హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ సంఘటన స్థలాన్ని సందర్శించి,అంజయ్యనగర్‌లో ఇలాంటి చిన్న ప్లాట్లపై ఎత్తైన అక్రమ భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంసితో కలిసి సర్వే నిర్వహించి ప్రమాదకర నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.స్థానికులు ఇంతకు ముందే అధికారులకు ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు అవసరమని మరోసారి నిరూపించింది.