11 August, 2026 | 4:36 PM

కేరళ పేరు మార్పు బిల్లుకు లోక్ సభ ఆమోదం

11-08-2026 03:52 PM

న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఈ మార్పును కోరుతూ తీర్మానం ఆమోదించిన రెండేళ్ల తర్వాత,  ప్రతిపక్ష ఎంపీల నిరంతర నినాదాల మధ్య 'కేరళ' పేరును 'కేరళం'గా మార్చే బిల్లు 2026ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లు కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని ప్రతిపాదిస్తోంది. జూలై 20న నీట్ (NEET) నిరసనకారులపై జరిగిన పోలీసు చర్యకు సంబంధించి హోం మంత్రి అమిత్ షా సభకు హాజరకావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తున్నప్పటికీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టారు.

సభకు అధ్యక్షత వహిస్తున్న కృష్ణ ప్రసాద్ తెన్నేటి, సభ సజావుగా సాగేలా సహకరించాలని ప్రతిపక్ష ఎంపీలను కోరారు. అయినప్పటికీ, గందరగోళం కొనసాగింది. నిత్యానంద రాయ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కేరళ పేరు మార్చే బిల్లుపై చర్చించకుండా ప్రతిపక్షాలను విమర్శించారు. "కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ బిల్లుపై మాట్లాడకపోవడం విచారకరం అని రిజిజు అన్నారు. గందరగోళం సద్దుమణగకపోవడంతో, ఎటువంటి చర్చా లేకుండానే ఆ బిల్లును ధ్వని ఓటు ద్వారా ఆమోదించారు.