శంకుస్థాపనకు తరలిన కరీంనగర్ రైతులు
మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న ఆధ్వర్యంలో కోహెడకు పయనం..
ముకరంపుర,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.2,284.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న ఆధ్వర్యంలో సుమారు 100 మంది రైతులు, వ్యాపారులు, మార్కెట్ ప్రతినిధులు శనివారం బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులు, ఏజెంట్లు, ట్రేడర్లతో కూడిన బస్సులను చైర్మన్ ఆకుల నరసన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యదర్శి అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆకుల నరసన్న మాట్లాడుతూ, దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో, ఆదర్శవంతమైన నమూనాగా రూ.2 వేల కోట్లకు పైగా వ్యయంతో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం రైతులకు గర్వకారణమని అన్నారు. తెలంగాణ రైతులు పండిస్తున్న పండ్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిందని పేర్కొన్నారు.






