6 June, 2026 | 8:03 PM

గ్రామసభలతో ప్రజా సమస్యలు పరిష్కారం

06-06-2026 06:52 PM

పచ్చదనం, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా 

ముకరంపుర,(విజయక్రాంతి): పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామ సభలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. శనివారం కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. దీనికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ... గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారమవుతాయని గ్రామస్తులకు సూచించారు.

 వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత నివ్వాలని పైపులైన్ల మరమ్మత్తులు,  నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలని కార్యదర్శిని ఆదేశించారు. ఇన్చార్జి ఆర్డీవో వెంకటరెడ్డి మాట్లాడుతూ సర్ లో భాగంగా ఓటరు నమోదు జాబితా, మ్యాపింగ్ ప్రక్రియ గురించి వివరించారు.