రైతు హక్కుల రక్షణకే భూముల రీ-సర్వే
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం,(విజయ క్రాంతి): రైతు హక్కుల రక్షణకే భూముల రీ-సర్వే నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపురం మండలంలోని చెల్పూర్ రైతు వేదికలో భూముల రీ-సర్వేకు సంబంధించిన గ్రామసభ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భూ సరిహద్దులు, రికార్డులకు సంబంధించిన సందేహాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... రీ-సర్వే ప్రక్రియ విజయవంతం కావాలంటే రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఏవైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ గ్రామసభలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లంకపెళ్లి భాస్కర్, చెల్పూర్ గ్రామ సర్పంచ్ కావటి రజిత రవీందర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






