క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు
ఎన్నిక కేంద్రాన్ని సందర్శించిన సిపీ
మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి(Kyathanahalli)మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శని వారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బందోబస్తును పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, కార్యాలయ పరిసరాల్లో అలాగే బయట కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఈ ఎన్నిక ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, మున్సిపల్ కార్యాలయ ఆవరణలోకి కేవలం కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు, అధికారులను మాత్రమే అనుమతించామన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీపీ వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్ గౌడ్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇతర పోలీస్ అధికారులున్నారు.




