26 June, 2026 | 4:34 PM

రెండోసారి విత్తుతున్న పత్తి విత్తనాలు

26-06-2026 03:37 PM

* మొదటిసారి విత్తిన  మొలకెత్తని పత్తి విత్తనాలు

* వర్షా బావ ప్రభావంతో పాటు.. నాసిరకం విత్తనాలే

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  గిరిజన, గిరిజనేతర  రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో  కురిసిన వర్షపు జల్లులకు  పత్తి విత్తనాలు నాటుకున్నారు. నాటిన విత్తనాలు  మొలకెత్తకపోవడంతో  రెండవసారి అప్పులు చేసి విత్తనాలు కొని  పత్తి విత్తనాలను  రెండోసారి  విత్తుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని  గ్రామాల్లో వర్షాకాలం ప్రారంభంలో కురిసిన తొలకరి చినుకులకు పత్తి విత్తనాలు పంట పనులు వేశారు. ఎలాగో వాన కాలంలో  వర్షాలు వస్తాయన్న  కోటి ఆశలతో రైతులు 65 వేల ఎకరాలలో  పత్తి, కంది సోయా విత్తనాలను వెతుకున్నారు.

వేసవి ఎండలను తలపించే విధంగా  జూన్ 21వ తేదీ వరకు  తీవ్రమైన ఎండలకు  విత్తనాలు భూమిలోనే  మాడిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు  నాటిన పత్తి విత్తనాలు  మొలకెత్తి ఉండవచ్చని రైతులు  పంట చేనులో తిరిగి చూస్తే  పది నుంచి 20 శాతం  మొలకలు వచ్చాయని మిగతా 80 శాతం  మొలకెత్తలేదని  రైతులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. మొలకెత్తిని  పత్తి విత్తనాల స్థలంలో  మరోసారి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి భూమిలో విత్తుచున్నారు. రెండోసారి  పత్తి విత్తనాలను విత్తుకోవడంతో  ఎకరానికి 5000 నుండి  6000 రూపాయల విత్తనాలతో పాటు  కూలీలకు కూలీ డబ్బులు చెల్లించవలసి వస్తుందని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం చేసిన అప్పుల తో పాటు విత్తనాల కొరకు మరోసారి అప్పులు చేయవలసి వచ్చిందని రైతులు వాపోతున్నారు.