11 April, 2026 | 1:53 AM

మహావతార్‌లోకి..!

11-04-2026 12:10 AM

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘స్త్రీ’ సినిమాతో మ్యాడక్ ఫిలింస్‌కు కాసుల వర్షం కురిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అదే బ్యానర్‌లో రాబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ‘మహావతార్’లో భాగం కాబోతున్నట్లు సమాచారం. పరశురాముడిగా నటిస్తున్న విక్కీ కౌశల్ సరసన శ్రద్ధా కపూర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తొలుత దీపికా పదుకొణె పేరు బాగా వినిపించింది.

కానీ, పరశురాముడి లాంటి శక్తిమంతమైన పాత్ర పక్కన శ్రద్ధా కపూర్ ఉంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. పైగా మ్యాడక్ ఫిలింస్‌కు శ్రద్ధా ఒక గోల్డెన్ లెగ్. ఆమె ఉంటే సినిమా హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఉండటంతో మేకర్స్ శ్రద్ధా వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జూన్ తర్వాత షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాలో శ్రద్ధా పాత్ర చాలా బలంగా, ఎంతో భావోద్వేగభరితంగా, ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం శ్రద్ధా ఒకవైపు ‘స్త్రీ 3’ పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు ‘ఈత’ అనే బయోపిక్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ‘మహావతార్’ తోడవ్వడం తో అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని పరశురాముడి జీవిత కథ ఆధా రంగా మైథలాజికల్ టచ్‌తో కూడిన భారీ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు.