పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం
డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాల్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించండి
జవహర్ నగర్ లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచండి
జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు
జవహర్ నగర్,(విజయక్రాంతి): పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాల్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని జవహర్ నగర్ లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ స్పష్టం చేసింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ లోని దళిత సంక్షేమ భవన్లో, వివిధ రాజకీయ పార్టీలు మీడియా మిత్రులు ప్రజాసంఘాల నేతలు శనివారం సమావేశమై డంపింగ్ యార్డ్ సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఇఫ్టు జాతీయ కార్యదర్శి షేక్షావలి, మల్లేష్ ఐఎఫ్టియు, శివ బాబు టి యు సి ఐ ప్రవీణ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జవహర్ నగర్ లో గాలి నీరు భూమి వాయువులు మొత్తం కలుషితమయ్యాయని, ప్రజలు ఇకనైనా మేలుకోకుంటే జవహర్ నగర్ మరో హిరోషిమా నాగసాకి నగరంలాగా తయారయ్యి పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. సమస్త జీవకోటికి జీవనాధారం నీరు వాయువు, గాలి, తదితర పంచభూతాలు డంపింగ్ యార్డ్ వల్ల కలుషితమై పోతున్నాయని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
జవహర్ నగర్ ప్రాంతంలో చాలా బస్తీల్లో డ్రైనేజీ మంచినీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జవహర్ నగర్ వాసులతోపాటు డంపింగ్ యార్డ్ బాధితుల ఆరోగ్యం కొరకు వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లేనియెడల డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సంసిద్ధులు అవుతామని తెలిపారు. అనంతరం డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. పోరాట కమిటీ చైర్మన్గా ఇఫ్టు షేక్షావలి, కన్వీనర్ గా ఉమా మహేష్, గౌరవ సలహాదారులుగా మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ రావల్కోల్ నరసింహ గౌడ్, కల్లేపల్లి సదానందం, తదితరులు ఎన్నికయ్యారు.






