20 నిమిషాలపాటు మనిషిని కాలేకపోయా!
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వేంకట సతీశ్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా విలేకరులతో చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మమాటల్లోనే.. “-నా పదేళ్ల కెరీర్‌లో ఒక కథకు ఇంతలా ఎక్సైట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్.
డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయా.. అంతలా కదిలించింది. కథలోనే ఇంత బలం ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యా. -ఒక సినిమాకు సెట్ వేస్తే అది సెట్ అని ప్రేక్షకులు గుర్తుపట్టకుండా ఉండాలి. అప్పుడే ఒక ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. నా వరకు ఈ సినిమాకు వేసిన సెట్స్‌ను ప్రేక్షకులు అవి సెట్ అని గ్రహించలేరు. అంత నేచురల్‌గా ఉంటాయి.
ఇదివరకే చాలా పీరియడ్ చిత్రాలు చేశా. ఆ అనుభవం నాకు ఉంది. -ఇది 70 విజయనగరం ఏరియాలో జరిగే కథ కాబట్టి అక్కడి వీధులు, క్లాక్ టవర్.. అన్నీ రీక్రియేట్ చేశాం. చుట్టుపక్కల ప్రాంతాలూ డిజైన్ చేశాం. కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నాం. మన ఊరి పొలంగట్ల మీద కూర్చుని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంత నేచురల్ ఫీలింగ్ క్యారీ అవుతుంది. ఇప్పటివరకు ఎవరూ చూడని కుస్తీ సెటప్ ఈ సినిమాలో చేశాం.
దానికోసం అండర్‌గ్రౌండ్ సెటప్‌లో షూట్ చేశాం. చరణ్ గధతో కనిపించిన షాట్ అక్కడే చేశాం. ఏడాదికిపైగానే ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఆ సమయంలోనే ప్రతి సెట్‌కు సంబంధించి మినియేచర్స్ క్రియేట్ చేసుకున్నాం. ప్రతి సెట్‌నూ ఓపెన్ గ్రౌండ్‌లోనే వేశాం. నేచురల్ లైట్‌లోనే తీశాం. ఇందులోని హిల్ స్టేషన్ ఊరు కోసం హైదరాబాద్‌లోని ఒక బూత్ బంగ్లా వాడాం.. కొండ కింద ఉన్న ఊరిలా అనిపిస్తుంది. ఆ సెట్ వేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
చెరుకు ఫ్యాక్టరీ సెట్‌నూ పసిగట్టలేరు. -స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24, దాదాపు 60- పైగా సెటప్స్ ఉంటాయి. విజయనగరం సెట్ వేసి దాదాపు ఏడాది అవుతుంది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎలాంటి వాతావరణంలోనైనా షూట్‌కు అనుకూలంగా ఉండేలాగే వేశాం. ఒక దేశీ ఆటగాడు ముడిసరుకులతో బ్యాట్‌ను ఎలా తయారు చేసుకుంటాడో.. హీరో బ్యాట్ కూడా అంతే సహజంగా తయారుచేశాం. ట్రైన్, స్పెషల్ సాంగ్, కుస్తీ.. ఇలా ప్రతి సెట్ ప్రతి సెట్‌ను చరణ్ అప్రిషియేట్ చేశారు.
కుస్తీ సీక్వెన్స్‌లో చరణ్‌కు గాయమైంది. ఆర్టిస్ట్ డేట్స్ అన్నీ మిస్ అయిపోతాయని, అలాంటి కండీషన్‌లోనూ చెర్రీ షూట్‌కు వచ్చారు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘పెద్ది’ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు. -సుకుమార్ మొన్న ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’కి మించి ఉంటుందని చెప్పడానికి కారణం.. ఈ కథలో అంత బలం ఉంది. నేను పనిచేస్తున్న కొత్త సినిమాలంటే.. ‘పారడైజ్’, అలాగే చిరంజీవి సినిమా ఉన్నాయి” అన్నారు.






