పతాక రూపకల్పనపై చారిత్రక వాస్తవాలు వెలుగులోకి తేవాలి
మెహర్ వాలంటరీ ఆర్గనైజేషన్ డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారనే ప్రచారంపై చారిత్రక ఆధారాలను పరిశీలించాలని మెహర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎంహెచ్ ఏ సిద్దీఖి, కార్యదర్శి అఫాన్ ఖాద్రీ, కెప్టెన్ ఎల్. పాండురంగారెడ్డిలు కోరారు.
సమకాలీన చారిత్రక రికార్డులు, రాజ్యాంగ సభకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తే సురయ్యా త్యాబ్జీ రూపొందించిన నమూనాను1947 జూలై 22న రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించినట్లు తెలుస్తోందని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారిక చరిత్రలో కూడా పింగళి వెంకయ్య పేరును ప్రస్తావించలేదని, పింగళి వెంకయ్యపై ప్రచారంలో ఉన్న అంశాలను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీజీ ‘యంగ్ ఇండియా’లో జాతీయ పతాకంపై చేసిన వ్యాఖ్యలు, అనంతరం జరిగిన పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జాతీయ పతాక రూపకల్పనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలని, చారిత్రక పత్రాలను బహిర్గతం చేసి వాస్తవాలను స్పష్టం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక, నిష్పక్షపాత కమిటీని ఏర్పాటు చేసి పూర్వపరాలను పరిశీలించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో న్యాయవాదులు అప్సర్ ఖాన్, బర్కత్ ఖాన్, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు డాక్టర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.






