దిగుబడి వచ్చే వెరైటీలను సాగు చేయాలి
జిల్లా వ్యవసాయాధికారి సురేఖ
హాజీపూర్, జూలై 2 : పత్తి పంటలో దిగుబడులు వచ్చే వెరైటీలను సాగు చేయడం మేలని జిల్లా వ్యవసాయాధికారి ఎల్తూరి సురేఖ సూచించారు. జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ పరిధిలోని పత్తి ఉత్పాదకత మిషన్ కింద మండలంలోని గుడిపేట రైతు వేదికలో కపాస్ కాంతి - 2026 పథకం కింద గురు వారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీఏఓ మాట్లాడారు. అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో దిగుబడి అధికమని, సాధారణ సాగుతో పోలిస్తే ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటడం వల్ల భూమి వినియోగం సమర్థవంతంగా జరిగి, ప్రారంభ దశలో కలుపు నియంత్రణ మెరుగుపడటంతో పాటు దిగుబడి సాధించే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే దగ్గర వరుసల మధ్య దూరంతో పత్తి సాగు (క్లోజర్ స్పేసింగ్) ద్వారా మొక్కల సాంద్రత పెరిగి, సూర్యరశ్మి, పోషకాల వినియోగం మెరుగుపడి ఏపుగా పెరిగి అధిక దిగుబడి సాధించే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రైతులను ప్రోత్సహించేందుకు 86 హెక్టర్లలో అధిక సాంద్రత పత్తి, 36 హెక్టర్లలో దగ్గర వరుసల మధ్య దూరంతో పత్తి (క్లోజర్ స్పేసింగ్) సాగు, 11 హెక్టర్లలో సమగ్ర పంట యాజమాన్యం (ఐసీఎం) కింద సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు.
అనంతరం కపస్ కాంతి పథకం కింద ప్రభుత్వ రాయితీ పత్తి విత్తనాల ప్యాకెట్లను ఆత్మ ఛైర్మెన్ సింగతి మురళితో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏడీఏ మామిడి క్రిష్ణ, ఎఫ్ పీ ఓ డైరెక్టర్ పుస్కూరి శ్రీనివాస రావు, మంచిర్యాల కార్పొరేషన్ కార్పొరేటర్ కమల శ్రీనివాస్ గౌడ్, చిన్న గోపాల్ పూర్ సర్పంచ్ జుగునాక రాజేష్, పీఏసీఎస్ డైరెక్టర్ నగేష్, ఆత్మ డైరెక్టర్ మునిమడుగుల శ్రీనివాస్, కర్ర సునీత జగన్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి క్రిష్ణ, ఏఈఓలు మధుప, మౌనిక, కొమురయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.






