11 August, 2026 | 7:42 PM

సర్పంచ్‌ విధులకు హైకోర్టు బ్రేక్!

11-08-2026 05:46 PM

మోఖద్ధం గూడ సర్పంచ్ ఎన్నికపై వివాదం

రీకౌంటింగ్ కోరిన ప్రత్యర్థి 

హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలిక స్టే

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేరేమేరి మండలం మోఖద్ధం గూడ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక వివాదం హైకోర్టు మెట్లు ఎక్కింది. ఎన్నికల సమయంలో తనకు అన్యాయం జరిగిందని, ఓట్ల లెక్కింపులో రీకౌంటింగ్‌కు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ మనీషా విజయ్ రాథోడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మోఖద్ధం గూడ సర్పంచ్ స్థానానికి విమలా బాయి, మనీషా విజయ్ రాథోడ్ తదితరులు పోటీ చేశారు.

ఎన్నికల ఫలితాల్లో విమలా బాయి తన సమీప ప్రత్యర్థి మనీషా విజయ్ రాథోడ్‌పై కేవలం ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఓట్ల లెక్కింపు సమయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మనీషా విజయ్ రాథోడ్ రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులను కోరినప్పటికీ తన అభ్యర్థనను అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్ తరఫు వాదనలను పరిశీలించిన అనంతరం, తదుపరి విచారణ జరిగే వరకు ప్రస్తుత సర్పంచ్ విమలా బాయి విధులకు హాజరు కాకుండా తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ  నెల 27 వరకు అమల్లో ఉండనుంది..దీంతో మోఖద్ధం గూడ సర్పంచ్ ఎన్నిక వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.