మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్
స్కాములపై మాట్లాడేందుకు రెడీ
అసెంబ్లీలో ఒక్కోస్కామ్ పై ఒక్కోరోజు చర్చిద్దాం
హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామికు మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) కౌంటర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ టెండర్లలో రూ. 2 వేల కోట్ల స్కామ్ జరిగిందన్న మాటకు కట్టుబడి ఉన్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాములపై మాట్లాడేందుకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వస్తారా? లేదా మొత్తం కేబినెట్ వస్తుందా?.. సీఎం రేవంత్ రెడ్డి వస్తారా? అని ప్రశ్నించారు. ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. సింగరేణిలో లేని లాభాలు వచ్చాయని బోల్తాపడ్డారని తెలిపారు. లాభాలు వస్తే సింగరేణి అప్పుల్లో ఎందుకుందన్నారు.
చెన్నూరు మున్సిపాలిటీనే(Chennur Municipality) మంత్రి వివేక్ గెలిపించుకోలేదని, సిద్దిపేట మున్సిపాలిటీ గెలుస్తామంటే నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ లో ఒక్కో స్కామ్ పై ఒక్కోరోజు చర్చిద్దామన్నారు. ''మమ్మల్ని సస్పెండ్ చేయకుండా.. వాయిదా వేయకుండా స్కామ్ లపై చర్చిద్దాం. మేం రెడీ'' అని హరీశ్ రావు మీడియాతో అన్నారు. రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ హరీష్ రావును ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో హ్యాండ్లూమ్ కార్పొరేషన్, లిడ్ క్యాప్ పనులను ప్రభుత్వ సంస్థలకు ఇస్తే.. రేవంత్ గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్లకు, ఇక్కడి కంపెనీలకు అన్యాయం చేశారని విమర్శించారు.
హరీశ్ రావుకి మంత్రి అడ్లూరి మరోసారి సవాల్
అటు మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మారోసారి సవాల్ విసిరారు. టెండర్లలో స్కామ్ జరిగినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. టెండర్ల పేరుతో బీసీ, ఎస్సీ, మైనార్టీ మంత్రులను అవహేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ టెండర్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం దాచుకోవడమే చేశారని తెలిపారు. పచ్చ కామెర్లు వచ్చినవాళ్లకు ఊరంతా పచ్చగా కనిపించినట్టు హరీశ్ రావుకు కూడా అలానే అనుకుంటున్నారని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.






