20 May, 2026 | 2:45 AM

50% డిస్కౌంట్‌తో పచ్చిరొట్ట విత్తనాలు

20-05-2026 01:44 AM
  1. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి 
  2. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

 హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ‘రైతునేస్తం’ కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు.

రైతులకు మేలు చేసేందుకు గాను పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లపెసర విత్తనాలను 50 శాతం భారీ రాయితీతో అందిస్తున్నామని ప్రకటించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట పంటలను ఎక్కువగా సాగు చేయాలన్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా భూమిని కాపాడుకుంటూనే అధిక దిగుబడులు సాధించాలి మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.

నిస్సారంగా మారిన నల్లబీడు భూములను తిరిగి సాగులోకి తెచ్చేందుకు, వాటి పునరుద్ధరణకు రైతులు జిప్సంను వినియోగించాలని మంత్రి తుమ్మల సూచించారు. సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు దృష్టి పెట్టాలన్నారు.

రైతుల ఆదాయం పెంపు, భూమి ఆరోగ్య సంరక్షణ, సహజ వనరుల సమర్థ వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు లక్ష్యాలతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాష్మిన్‌బాషా, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.